Ap: ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి సమీపంలోని మూలపాడు బటర్ ఫ్లై పార్క్‌లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి Pawan Kalyan పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తల్లి అంజనా దేవి పేరు మీద కొండపల్లి బొమ్మల తయారీలో ఉపయోగించే తెల్ల పొణికి మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రధానమంత్రి Narendra Modi ఇచ్చిన “మా కే నామ్ ఏక్ పేడ్” పిలుపు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రితో కలిసి విద్యార్థులు ఏకకాలంలో 1,000 అంకుడు మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. మహిళలు, చిన్నారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి స్వయంగా విత్తన బంతులను తయారు చేశారు. అంకుడు, తెల్లపొణికి, వేప, కుంకుడు, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత, మోదుగ వంటి స్వదేశీ జాతుల విత్తనాలతో ఈ సీడ్ బాల్స్ రూపొందిస్తున్నారు.
మూలపాడు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 ప్రాంతాల్లో జరుగుతున్న సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పాల్గొంటున్న ప్రజలతో మాట్లాడి, విత్తనాల రకాలు మరియు తయారీ పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూన్ 15 నాటికి 2.5 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం డ్రోన్ల సహాయంతో కొండ ప్రాంతాల్లో విత్తన బంతులను వెదజల్లే ప్రక్రియను పరిశీలించారు.
బటర్ ఫ్లై పార్క్‌లో ఏర్పాటు చేసిన అటవీ శాఖ స్టాల్స్‌ను సందర్శించిన పవన్ కళ్యాణ్, ప్రతి ఎకో టూరిజం పార్కులో యోగా హాల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కొండపల్లి కొయ్య బొమ్మలు, ఉదయగిరి కళాకారుల చేతిపనులను పరిశీలించి, కళాకారుల ఉత్పత్తులకు మార్కెటింగ్ మరియు ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చేతివృత్తుల కళాకారులను ప్రతి రెండు నెలలకు ఒకసారి కలిసేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
