హైదరాబాద్: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీసులు గురువారం రాత్రి నగరవ్యాప్తంగా ‘ఆపరేషన్ కవచ్’ పేరిట ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు సాగిన ఈ డ్రైవ్‌లో వాహనాల నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్‌పై ప్రధానంగా దృష్టి సారించారు. నేరస్థులు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్లను మార్పులు చేయడం, అస్పష్టంగా ఉంచడం లేదా నకిలీ నంబర్లను వినియోగించడం వంటి చర్యలకు అడ్డుకట్ట వేయడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని పోలీసులు తెలిపారు.
నగరంలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కీలక ప్రాంతాలను ఎంపిక చేసి లా అండ్ ఆర్డర్ సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్, మధురానగర్, బోరబండ, సనత్‌నగర్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెకింగ్ పాయింట్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ స్వయంగా సందర్శించారు. కొన్ని వాహనాలను ఆపి నంబర్ ప్లేట్లను పరిశీలించిన ఆయన, నిబంధనలు పాటించని వాహనదారులతో మాట్లాడి అవగాహన కల్పించారు. ఉద్దేశపూర్వకంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో నగరవ్యాప్తంగా మొత్తం 12,098 వాహనాలను తనిఖీ చేశారు. వీటిలో 8,802 ద్విచక్ర వాహనాలు, 1,693 నాలుగు చక్రాల వాహనాలు, 1,623 ఆటోలు ఉన్నాయి. తనిఖీల్లో 1,406 వాహనాల్లో నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లు, 1,132 వాహనాల్లో అసలు నంబర్ ప్లేట్లు లేకపోవడం, 69 వాహనాల్లో నకిలీ నంబర్ ప్లేట్లు ఉన్నట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 2,149 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 2,046 ద్విచక్ర వాహనాలు, 52 కార్లు, 51 ఆటోలు ఉన్నాయి.
ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌ను సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనగా పరిగణించబోమని స్పష్టం చేశారు. ఇది సమాజ భద్రతకు ముప్పుగా మారుతోందని, అమాయక వాహనదారులకు తప్పుడు ఈ-చలాన్లు వెళ్లడం, కేసుల్లో ఇరుక్కునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. నంబర్ ప్లేట్లలో ఉద్దేశపూర్వక మార్పులు చేసే వారిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లను స్పష్టంగా ఉంచుకోవాలని, వాహనాల ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. రానున్న రోజుల్లో అన్ని రకాల వాహనాలపై దశల వారీగా ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు.
