హైదరాబాద్, జూన్ 15: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ (ఫేజ్-2) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మెట్రో ప్రాజెక్టు విస్తరణ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రూపకల్పన జరిగిందని, అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి కృషితో ఈ ప్రాజెక్టు నగరానికి వచ్చిందని సీఎం గుర్తు చేశారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత చారిత్రక కట్టడాల పేరుతో మెట్రో తొలి దశ పనులు ఆలస్యం అయ్యాయని, దీంతో రూ.15 వేల కోట్లతో పూర్తికావాల్సిన ప్రాజెక్టు వ్యయం రూ.22 వేల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
కోవిడ్ ప్రభావం, ప్రాజెక్టు ఆలస్యం కారణంగా ఎల్అండ్టీ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో పడిందని, అందువల్ల మెట్రో ఫేజ్-2 నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి సంస్థ నిరాకరించిందని తెలిపారు. దీంతో మెట్రో ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడమే మార్గమని కేంద్ర ప్రభుత్వం సూచించిందన్నారు.
రూ.30 వేల కోట్ల విలువైన మెట్రో ఆస్తులను సుమారు రూ.15 వేల కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిందని సీఎం చెప్పారు. ఎల్అండ్టీ మెట్రోపై ఉన్న రూ.13,600 కోట్ల రుణాన్ని తక్కువ వడ్డీకి ఐఆర్ఎఫ్సీ (IRFC) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు.
జపాన్ ఆర్థిక సంస్థ నుంచి సుమారు 4 శాతం వడ్డీకి నిధులు సమకూర్చే ఏర్పాట్లు చేసినప్పటికీ, రుణ బదిలీ ప్రక్రియను కేంద్రం నిలిపివేసిందని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని అడ్డుకున్నారని విమర్శించారు.
“కేంద్ర ప్రభుత్వం మెట్రో ఫేజ్-2లో భాగస్వామ్యం కావాలనుకుంటే ముందుకు రావాలి. లేకపోతే ఎన్ఓసీ ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం సొంతంగా మెట్రో విస్తరణ చేపడుతుంది” అని సీఎం స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగర భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని 122 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశను పూర్తి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణకు మెట్రో విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని, ఇతర రాష్ట్రాలకు అనుమతులు ఇచ్చి తెలంగాణ ప్రతిపాదనలను పెండింగ్లో ఉంచడం అన్యాయమని విమర్శించారు.
Centre Must Clarify Its Stand on Hyderabad Metro Phase-II Expansion: Chief Minister Revanth Reddy
