ఢిల్లీలో జనసేన జాతీయ సమైక్యత సభ.. ఐదు కీలక తీర్మానాలకు ఆమోదం
న్యూఢిల్లీ: జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ‘సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం’ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దేశ సమైక్యత, అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, యువత ఆకాంక్షలు, జనసేన 12 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించిన ఐదు కీలక తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి జనసేన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అలాగే ‘నేషన్ ఫస్ట్’ సిద్ధాంతాన్ని పార్టీ మరోసారి స్పష్టం చేస్తూ దేశ సమగ్రత, ఐక్యత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన పునర్నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ప్రత్యేక తీర్మానం ఆమోదించారు.
జనసేన పార్టీ 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని అభినందించాయి. యువత ఆశయాలు, ఆకాంక్షలను అర్థం చేసుకుని వారికి రాజకీయంగా, సామాజికంగా అండగా నిలుస్తామని మరో తీర్మానంలో పేర్కొన్నారు.
సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించి అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. అమర స్థూపం వద్ద పుష్పగుచ్ఛం సమర్పించి దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల సేవలను స్మరించుకున్నారు. త్యాగచక్రలో చెక్కిన తెలుగు వీర జవాన్ల పేర్ల వద్ద ప్రత్యేకంగా అంజలి ఘటించారు.
సభ ముగింపు సందర్భంగా పవన్ కళ్యాణ్ యువతకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ప్రభావంతో వచ్చే గందరగోళపూరిత సిద్ధాంతాలకు దూరంగా ఉండాలని, ప్రతి అంశాన్ని చదివి, పరిశీలించి, అవగాహనతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దేశ సమగ్రత, భద్రత, భవిష్యత్తు కోసం యువత బాధ్యతాయుతంగా ఆలోచించాలని అన్నారు. ప్రాంతీయత కంటే జాతీయతకు ప్రాధాన్యం ఇవ్వాలని, దేశ ప్రయోజనాలే
ముందుండాలని స్పష్టం చేశారు.
Jana Sena Holds National Integration Meet in Delhi
