ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ వైద్య పరీక్షల నిమిత్తం ఆదివారం ముంబై చేరుకున్నారు. గత కొంతకాలంగా భుజాలకు సంబంధించిన తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన, అధునాతన వైద్య పరీక్షలు మరియు నిపుణుల సలహా కోసం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లనున్నారు.
వైద్యుల ప్రాథమిక నిర్ధారణ ప్రకారం పవన్ కళ్యాణ్‌కు రెండు భుజాల్లో రొటేటర్ కఫ్ (Rotator Cuff) గాయం ఏర్పడింది. అలాగే రెండు భుజాలకు సంబంధించిన కండరాలు పూర్తిగా చిట్లినట్లు వైద్యులు గుర్తించినట్లు సమాచారం. ఈ కారణంగా ఆయన కొంతకాలంగా భుజాల నొప్పి, చేతుల కదలికలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ గాయానికి సంబంధించి మరింత సమగ్ర పరీక్షలు నిర్వహించి, తదుపరి చికిత్స విధానంపై వైద్య నిపుణులు నిర్ణయం తీసుకోనున్నారు.
ముంబై పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ వెంట ఆయన సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల ఉన్నారు. ఆసుపత్రిలో ప్రత్యేక నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక సమావేశాలు, ప్రజా కార్యక్రమాలతో పాటు రాజకీయ బాధ్యతల్లో బిజీగా ఉన్నప్పటికీ, భుజాల నొప్పి తీవ్రత పెరగడంతో వైద్యుల సూచన మేరకు ముంబై వెళ్లినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
వైద్య పరీక్షల అనంతరం అవసరమైతే తదుపరి చికిత్స లేదా శస్త్రచికిత్సపై నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నివేదిక వెలువడిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
