తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరుడికి అందుతున్న ప్రభుత్వ లబ్ధుల పూర్తి వివరాలు ఒకే కార్డులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డు’ (యూనిఫైడ్ వెల్ఫేర్ కార్డ్) రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి. అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ప్రభుత్వం ద్వారా ఏ శాఖ నుంచి, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి అందుతోందనే వివరాలు ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సీఎం సూచించారు. ఇందుకోసం అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో మరింత పారదర్శకత పెరుగుతుందని అన్నారు. నిజమైన అర్హులకు పథకాల ప్రయోజనాలు ఖచ్చితంగా చేరుతాయని, అదే సమయంలో అనర్హులను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు జారీ చేసే విధానానికి బదులుగా, ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఒకే సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని సీఎం సూచించారు. టెక్నాలజీపై మంచి పట్టు కలిగిన యువ ప్రభుత్వ అధికారులను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్డులో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, కార్మిక శాఖ సంక్షేమ పథకాలు, విద్యాశాఖ పథకాలు, ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ బీమా పథకాల వివరాలు సమగ్రంగా ఉండాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఆధార్ నంబర్ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్‌ను కూడా ఇవ్వాలనే అంశంపై పరిశీలించాలని సూచించారు.
ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డుతో అనుసంధానించాలని సీఎం పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వానికి సమగ్ర అవగాహన ఏర్పడుతుందని అన్నారు.
లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమాచారం కూడా సేకరించాలని ఐటీ శాఖను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ సేవల అమలులో సాంకేతికతను మరింత సమర్థంగా వినియోగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ వ్యవస్థను రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. ఉదాహరణకు ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే, ఆ సమాచారం వెంటనే చేయూత పెన్షన్ డేటాబేస్‌కు చేరేలా వ్యవస్థ ఉండాలని చెప్పారు. దాని ఆధారంగా తక్షణ చర్యలు ప్రారంభమయ్యేలా సమన్వయం చేయాలని సూచించారు. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను కూడా సమగ్ర సంక్షేమ కార్డుతో అనుసంధానించాలని పేర్కొన్నారు.
ఇక విదేశీ ఉపాధి అవకాశాల విషయంలో కేరళ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే ఉద్యోగుల కోసం నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు, పాస్‌పోర్ట్‌లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులో ఉంచితే అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని తెలిపారు.
పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ప్రభావాన్ని సమగ్రంగా అంచనా వేసే విధంగా ఈ సమగ్ర సంక్షేమ కార్డు ఉపయోగపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
