సైబరాబాద్ ప్రాంత అభివృద్ధికి భారీ ఊతమిచ్చే విధంగా మొత్తం రూ.1,674.74 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా రూ.161 కోట్లతో నిర్మించనున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రధాన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రూ.530 కోట్ల అంచనా వ్యయంతో మియాపూర్ చౌరస్తా వద్ద నిర్మించనున్న ఫ్లైఓవర్ పనులకు కూడా ప్రారంభం పలుకనున్నారు.
రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమైన రూ.308 కోట్లతో శేరిలింగంపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనుంది. మరోవైపు రూ.65.53 కోట్లతో పూర్తయిన బాచుపల్లి ఫ్లైఓవర్‌ను ప్రజలకు అంకితం చేయనున్నారు.
ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిసర ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా రూ.229 కోట్లతో సర్వీస్ రోడ్ల నిర్మాణం, ప్రధాన వంతెన ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా రూ.110 కోట్లతో శంకర్‌పల్లి రోడ్‌లోని ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు పైప్‌లైన్ రోడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.
కొల్లూరు ఇంటర్‌చేంజ్ సమీపంలో రూ.29.25 కోట్లతో రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిల వరకు నాలుగు లేన్ల అప్రోచ్ ర్యాంపుల నిర్మాణం, రూ.26.50 కోట్లతో నానక్‌రామ్‌గూడ నుంచి గచ్చిబౌలి వరకు ORR ప్రధాన క్యారేజ్‌వే విస్తరణ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.
విద్యా, మహిళా సంక్షేమ రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, రూ.14.40 కోట్లతో మాదాపూర్ మరియు నానక్‌రామ్‌గూడ ప్రాంతాల్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.
ఇదిలా ఉండగా, మియాపూర్ శివాలయం బస్ స్టాప్ సమీపంలో సీఎం బహిరంగ సభ, ఫ్లైఓవర్ శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్‌హెచ్-65తో పాటు మియాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు.
