పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన SRH.. ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ
హైదరాబాద్: IPLలో మరోసారి తన దూకుడును కొనసాగించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, బుధవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో హైదరాబాద్ 11 మ్యాచ్‌లలో 14 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా, ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత బలపర్చుకుంది.
236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌లు తగిలాయి. కెప్టెన్ పాట్ కమిన్స్ తొలి ఓవర్‌లోనే ఇంపాక్ట్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్యా (1)ను ఔట్ చేయగా, తదుపరి ఓవర్‌లో నితీశ్ కుమార్ రెడ్డి తన తొలి బంతికే ప్రభ్‌సిమ్రన్ సింగ్ (3) వికెట్ పడగొట్టాడు.
అదే జోరులో ఎషాన్ మలింగా బౌలింగ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5) మిడ్ ఆఫ్‌కు క్యాచ్ ఇవ్వడంతో పంజాబ్ 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో మార్కస్ స్టోయినిస్ (28) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా, శివాంగ్ కుమార్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అనంతరం కూపర్ కానోలీ (107 నాటౌట్, 59 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. సుయాంశ్ షెడ్గే (25)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పినా, కమిన్స్ అతడిని ఔట్ చేయడంతో పంజాబ్ ఆశలు చిద్రమయ్యాయి. చివర్లో శశాంక్ సింగ్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో లక్ష్యానికి చేరుకోలేక పరాజయం పాలైంది.
అభిషేక్-హెడ్ దూకుడు
ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ (35) మరియు ట్రావిస్ హెడ్ (38) మెరుపు ఆరంభం అందించారు. కేవలం 21 బంతుల్లోనే 54 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ మార్కో జాన్సెన్ ఓవర్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదుతూ స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు.
అయితే ఇద్దరూ వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయారు. ఫెర్గుసన్ అభిషేక్‌ను ఔట్ చేయగా, చాహల్ బౌలింగ్‌లో హెడ్ లాంగ్ ఆఫ్‌కు క్యాచ్ ఇచ్చాడు.
క్యాచ్‌లు వదిలేసి భారీ మూల్యం చెల్లించిన పంజాబ్
ఇక్కడి నుంచే మ్యాచ్ పూర్తిగా హైదరాబాద్ వైపు మళ్లింది. పంజాబ్ ఫీల్డర్లు వరుసగా కీలక క్యాచ్‌లు వదిలేయడంతో సన్‌రైజర్స్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. ఇషాన్ కిషన్‌ను 9, 18 పరుగుల వద్ద వదిలేయగా, హెన్రిచ్ క్లాసెన్‌ను కూడా 9 పరుగుల వద్ద జీవితదానం ఇచ్చారు.
ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకున్న ఇషాన్ కిషన్ (55, 32 బంతుల్లో 4 సిక్సర్లు) దూకుడుగా ఆడుతూ అర్ధశతకం సాధించాడు. మరోవైపు క్లాసెన్ (69, 43 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శించాడు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు కేవలం 48 బంతుల్లో 88 పరుగులు జోడించి మ్యాచ్‌ను పూర్తిగా హైదరాబాద్ ఆధీనంలోకి తీసుకెళ్లారు.
చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (29 నాటౌట్) క్లాసెన్‌తో కలిసి వేగంగా పరుగులు రాబట్టడంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
